పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని... పోలింగ్ ప్రశాంతంగా సాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్నారు. చాలా చోట్ల నాలుగు గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలో ఉన్నారన్న ఆయన... అభ్యర్థులు ఎక్కువగా ఉండడం ఓ సవాల్‌గా మారిందని చెప్పారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించిన సిబ్బంది, పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్న సీఈఓ... ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అదనపు కంపార్ట్ మెంట్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
హోంమంత్రిపై ఫిర్యాదు...
హోంమంత్రి మహమూద్ అలీపై ఫిర్యాదు వచ్చిందని, రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక వచ్చాక ఈసీకి పంపిస్తామని శశాంక్ గోయల్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో భాజపా అభ్యర్థిపై దాడి జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందన్న ఆయన... రిటర్నింగ్ అధికారి, పోలీసుల నుంచి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
ఈనెల 17న లెక్కింపు...
ఈనెల 17న సరూర్ నగర్ స్టేడియం, నల్గొండ మార్కెట్ గిడ్డంగిలో ఓట్ల లెక్కింపు చేపడతామని, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో ఎనిమిది హాళ్లు, ఒక్కో హాళ్లో ఏడు టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్న సీఈఓ... ఒకేసారి 56 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి:ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం