రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ దూసుకుపోతున్నాయి. ముఖ్య నేతల పర్యటనలతో ప్రచారం జోరందుకుంటోంది. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఒకసారి ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని రంగారెడ్డి-మహబూబ్‌నగర్-హైదరాబాద్ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేబీఆర్ పార్కులో ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభలో అభ్యర్థి వాణీదేవితో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
భాజపా దూకుడు..
భాజపా సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ అభ్యర్థి రాంచందర్‌రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రచారం చేశారు. ఉద్యోగాల లెక్కల విషయంలో తెరాస అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి స్థానానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ప్రజలు కేసీఆర్ కుటుంబపాలన పట్ల విసుగు చెంది మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.