తెలంగాణ

telangana

ETV Bharat / state

Land grab: కబ్జాదారుల చెరలో 10 వేల ఎకరాలు.. ఆ జిల్లాల్లోనే ఆక్రమణలు ఎక్కువ

Land grab: ‘గజం కాదు.. రెండు గజాలు కాదు... ఎకరం కాదు... రెండెకరాలు కాదు... ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల విస్తీర్ణం ఏకంగా 10 వేల ఎకరాలు... సింహభాగం హైదరాబాద్‌ మహానగరం చుట్టుపక్కలే. ఈ భూముల్లో అత్యధికం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఉండగా తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్‌ జిల్లాల్లోనివి ఉన్నాయి. ఉండటానికి పాక వేసుకున్నారా...  ఆక్రమించడానికా.. లేదా పెద్దల ముసుగులోనా? కారణమేదైనా వేల ఎకరాల సర్కారు భూమి ఆక్రమణల్లో ఉందనేది యథార్థం. అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమన్న సత్యాన్నీ అంగీకరించాల్సిందే.

By

Published : Mar 23, 2022, 4:57 AM IST

land grabbing
కబ్జాదారుల చెరలో 10 వేల ఎకరాలు

Land grab: ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబరులో సర్కారు అవకాశం కల్పించింది. 125 చదరపు గజాల్లోపు జాగాలను జీవో 58 ప్రకారం ఉచితంగా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని వాటిని మార్కెట్‌ విలువకు క్రమబద్ధీకరించేందుకు జీవో 59 ద్వారా అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే క్రమబద్ధీకరణ కోసం వచ్చిన భూముల విస్తీర్ణం 15 వేల ఎకరాలకు పైగా ఉంది. ఇందులో నిబంధనల మేరకు ఉన్న 5,250 ఎకరాలను.. అంటే 2.54 కోట్ల చదరపు గజాలను క్రమబద్ధీకరించారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆక్రమణల చెరలో దాదాపు 10 వేల ఎకరాలు అంటే 4.84 కోట్ల చదరపు గజాల స్థలం ఉండిపోయింది. ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా రెవెన్యూ, పురపాలక యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఉదాసీన వైఖరితో కొత్త ఆక్రమణలూ పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తూనే ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడంలో సర్కారు యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. ఫలితంగా ఆక్రమార్కుల చేతుల్లోనే అనధికారంగా రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ఉండిపోతున్నాయి.

మేడ్చల్‌ జిల్లా నుంచి 7,484..

58 జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.46 లక్షల దరఖాస్తులు ఉచిత క్రమబద్ధీకరణకు రాగా నిబంధనలు అనుగుణంగా ఉన్న 1.37లక్షల దరఖాస్తులను ఆమోదించి క్రమబద్ధీకరించారు. భారీ ఆక్రమణలు, పెద్ద పెద్ద స్థలాల క్రమబద్ధీకరణకు 59 జీవో ప్రకారం నగరాలు, పట్టణాల్లో 48 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నుంచి ఉండటం గమనార్హం. ఈ జిల్లా నుంచి 7,484 రాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 3,897, సంగారెడ్డి జిల్లా నుంచి 3,159, సిద్దిపేటలో 3,551 హైదరాబాద్‌ 1,987 దరఖాస్తులు వచ్చాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details