రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది సహా పెన్షనర్లు మొత్తం 9 లక్షల 21 వేల37 మందికి 30 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఉద్యోగల కనీస వేతనం రూ.19 వేలకు పెరిగింది. 2018 జూలై ఒకటో తేదీ నాటికి ఉన్న డీఏ 30 శాతం మూలవేతనంలో కలుస్తుంది.
PRC: ఉద్యోగులకు తీపికబురు... పీఆర్సీ అమలుపై ఉత్తర్వులు జారీ - ఫిట్మెంట్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. పీఆర్సీ అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి 30 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ ఆర్థికశాఖ వేర్వేరుగా ఉత్తర్వులిచ్చింది.
ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేస్తూ అందుకు అనుగుణంగా స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు ఉద్యోగులకు అందనున్నాయి. ఏప్రిల్, మే నెల బకాయిలు.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నోషనల్ బెనిఫిట్ 2018 జూలై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఆర్ఏను 24 శాతానికి తగ్గనుంది. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌లో 17శాతం, 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్న 42 పట్టణాల్లో 13శాతం, ఇతర ప్రాంతాల్లో 11శాతం హెచ్ఆర్ఏ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
హెచ్ఆర్ఏపై ఇప్పటి వరకు ఉన్న గరిష్ఠ పరిమితిని ఎత్తివేశారు. పెన్షనర్లకు 36 వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నారు. 2018 జులై తర్వాత పదవీ విరమణ అయిన ఉద్యోగులకూ 2020 పీఆర్సీ ప్రకారమే పింఛన్ అందనుంది. కనీస పింఛను మొత్తాన్ని రూ.6500 నుంచి రూ.9500లకు పెంచగా.. రిటైర్మెంట్ గరిష్ఠ గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షల రూపాయలకు పెరిగింది. పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు మెడికల్ అలవెన్స్ నెలకు 350 నుంచి 600 రూపాయలకు... ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల వేతనాలు కూడా పెరిగాయి. 30 శాతం పెరగడంతో ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15,600 రూ.19,500, రూ.22,750 గా ఉండనున్నాయి. సీపీఎస్, ఫ్యామిలీ పెన్షన్ తదితరాలకు సంబంధించి కూడా నిర్ణయాలను ప్రకటించారు.