తెలంగాణ

telangana

ETV Bharat / state

Recruitment: ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు.. ఆ రెండు శాఖల్లోనే అధికం - భారీగా ఉద్యోగ నియామకాలు

Recruitment: భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ప్రభుత్వం తొలి విడతలో 30వేల పైచిలుకు పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. రికార్డుస్థాయిలో 503 గ్రూప్-వన్‌ పోస్టులతోపాటు పోలీసు, వైద్యారోగ్యశాఖలో పెద్దసంఖ్యలో ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. మిగిలిన ఉద్యోగాల నియామకం కోసం తదుపరి దశలో అనుమతులు ఇవ్వనున్నారు.

Recruitment
ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు

By

Published : Mar 24, 2022, 5:06 AM IST

Updated : Mar 24, 2022, 6:44 AM IST

Recruitment: నిరుద్యోగ యువత సుధీర్ఘ నిరీక్షణ ఫలించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. శాసనసభ వేదికగా 80 వేల 39 ఉద్యోగాల భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనకు కొనసాగింపుగా ఆర్థికశాఖ తదుపరి ప్రక్రియ చేపట్టింది. తొలివిడదలో 30 వేల 453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 503 గ్రూప్‌ వన్ పోస్టులతోపాటు పోలీసు, వైద్యారోగ్యశాఖలోని వివిధ ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. టీఎస్​పీఎస్సీ ద్వారా 3,576 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోలీసు నియామక బోర్డు ద్వారా 16,804 పోస్టులు, వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా 10,028 పోస్టులు నింపుతారు. వైద్య, ఆరోగ్యశాఖా పరమైన కమిటీ ద్వారా 45 పోస్టులు భర్తీ చేస్తారు.

ఎంపీడీఓ పోస్టులే అధికం

503 గ్రూప్‌వన్‌ పోస్టుల్లో 42 డిప్యూటీ కలెక్టర్, 91 డీఎస్పీ, 121 ఎంపీడీఓ పోస్టులున్నాయి. బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు ఐదు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38, మున్సిపల్ కమిషనర్ రెండో గ్రేడ్ పోస్టులు 35 ఉన్నాయి. 48 వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 26, జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఐదు ఉన్నాయి.

పోలీసు నియామకాలు అధికం

పోలీసు నియామక బోర్డు ద్వారా 4 వేల 965 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 4 వేల 423 ఏఆర్ కానిస్టేబుల్‌ పోస్టులు, 5 వేల 704 టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు, 262 ఐటీ అండ్ సీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నాయి. సివిల్‌ ఎస్సై పోస్టులు 415, ఏఆర్ ఎస్సై పోస్టులు 69, టీఎస్ఎస్పీ SI పోస్టులు 23, ఐటీ అండ్ సీ ఎస్సై పోస్టులు 23, సీపీఎల్‌లో ఐదు ఎస్సై పోస్టులు ఉన్నాయి. జైళ్ల విభాగంలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పోలీసు విభాగంలో 227 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. రవాణాశాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 36 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

వైద్యశాఖలో పదివేలకు పైగా భర్తీ

వైద్య, ఆరోగ్యసేవల నియామక బోర్డు ద్వారా 10 వేల 28 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అందులో ఎంపీహెచ్​ఏ మహిళ-1520, వైద్యవిద్య అసిస్టెంట్ ప్రొఫెసర్-1,183, వైద్యవిద్య స్టాఫ్‌నర్స్- 3,823, వైద్యవిద్య ట్యూటర్- 357 పోస్టులు ఉన్నాయి. ప్రజారోగ్య సివిల్ అసిస్టెంట్ సర్జన్-751 ఖాళీలు భర్తీ చేస్తారు. వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్-1,284, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎం -265, వైద్య విధాన పరిషత్ స్టాఫ్ నర్సు- 757 పోస్టులు ఉన్నాయి. శాఖాపరమైన ఎంపిక కమిటీ ద్వారా నిమ్స్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తారు. టీఎస్​పీఎస్సీ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలో 2,662 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు.

అనుమతించిన పోస్టుల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలన్న ఆర్థికశాఖ... రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సహా అన్ని వివరాలను అందించాలని ఆయా శాఖలకు స్పష్టం చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై కూడా సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి అనుమతులు ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది.

Last Updated : Mar 24, 2022, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details