దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించడం వల్ల ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రీకృతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. కేంద్రం మార్గదర్శకాలు, సడలింపుల నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 5వ తేదీన జరగనున్న మంత్రిమండలి సమావేశం కీలకంగా మారింది.
భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశంపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించినందున రాష్ట్రం అమలు చేయడం అనివార్యంగా మారింది. దీనికి భిన్నంగా వ్యవహరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయాల పట్ల రాష్ట్రం కొంత సానుకూలంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లు, పారిశ్రామికవాడల్లో పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
సడలింపులపైనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడి కావాల్సి ఉంది. కేంద్రం వెలువరించిన తాజా మార్గదర్శకాల్లో బస్సుల రాకపోకలు, మద్యం దుకాణాలకు అనుమతులు కీలకం కానున్నాయి. బస్సులను నడపడం ప్రజలకు సౌలభ్యంగా ఉండే అవకాశం ఉన్నా.. వ్యక్తిగత దూరం పాటించాలనే నిబంధనల అమలు కష్టసాధ్యం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం విక్రయం కూడా ఒకటి.