సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఓ వ్యక్తిని బూటుకాలుతో తన్నిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న పటాన్చెరు మండలం కొల్లూరులో నారాయణ కళాశాలకు చెందిన విద్యార్థిని సంధ్యారాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు హోంమంత్రి ఆదేశాలు
14:37 February 27
విద్యార్థి తండ్రిని బూటుకాలితో తన్నిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థిని మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నాకు ప్రయత్నించాయి. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని గేటు తాళాలు పగులగొట్టి బయటికి తీసుకోచ్చారు. పోలీసులు అడ్డుకొని మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లనీయకుండా సంధ్యారాణి తండ్రి అడ్డుపడ్డాడు. శ్రీధర్ అనే కానిస్టేబుల్ మృతురాలి తండ్రిని బూటుకాలితో తన్ని అడ్డు తొలగించి మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకెళ్లారు. కూతురిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న విద్యార్థిని తండ్రిని తన్నడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. పలువురు నెటిజన్లు కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు.
స్పందించిన మంత్రి కేటీఆర్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి, డీజీపీని కోరారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి మహమూద్ అలీ.. కానిస్టేబుల్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా సంగారెడ్డి ఎస్పీని ఆదేశించారు. కానిస్టేబుల్ శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ సంగారెడ్డి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.