Telangana Budget Sessions 2023 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెడ్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సర్కారు ఇప్పటికే లేఖ రాసింది.
Telangana Governor Vs CM : ఉభయసభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈమారు కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై ఇంకా అనుమతి ఇవ్వలేదు. నిరుడు కూడా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
Telangana State Budget Sessions 2023 : అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సిఫారసు చేసినట్లు అప్పట్లో పేర్కొన్నారు. సిఫారసు చేసేందుకు కొంత సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి సహకార, సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు గత ఏడాది గవర్నర్ ప్రకటించారు.
ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిఫారసు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత బడ్జెట్ సిఫారసుకు అనుమతి కోరుతూ గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు.