Governor Vs Government: రేపట్నుంచి ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం లేకపోవడం మరోమారు చర్చకు దారితీసింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సుధీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. సంప్రదాయం ప్రకారం ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞతతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందన్న తమిళిసై... కొత్త సెషన్ కానందున సాంకేతిక అంశాల కారణంగా గవర్నర్ ప్రసంగం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఐదు నెలల విరామం తర్వాత సభ సమావేశమవుతోందని.. సాధారణ పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభ సమావేశమైనప్పుడు, కొత్త సెషన్ కోసం సభను ఏర్పాటు చేస్తారని గవర్నర్ వ్యాఖ్యానించారు.
ప్రసంగం రాజ్‌భవన్ తయారు చేయదు...
సుదీర్ఘ విరామం ఉన్నప్పటికీ, ప్రభుత్వం మునుపటి సెషన్‌ను కొనసాగించాలని నిర్ణయించిందని... సాంకేతిక కారణాలతో సంప్రదాయంగా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని రాజ్‌భవన్ తయారు చేయదని, అది ప్రభుత్వ ప్రకటన అని తమిళిసై స్పష్టం చేశారు. గతేడాదిగా ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలు, తదుపరి సంవత్సరానికి సంబంధించిన విధాన సూచికల నివేదిక కార్డు గవర్నర్ ప్రసంగమని వివరించారు. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న విషయాల ఆధారంగా సభలో అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుందన్నారు. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు తన అనుమతి కోరినప్పుడు ప్రభుత్వం తెలిపిందని తమిళిసై గుర్తు చేశారు. తదుపరి వివరణలో... దురదృష్టవశాత్తు అది అనుకోకుండా జరిగిందని ప్రభుత్వం పేర్కొందన్నారు. అనుకోకుండా నోట్ వచ్చిందని ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని గవర్నర్ ఆక్షేపించారు.
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని...
ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేసినట్లు గవర్నర్ తెలిపారు. సిఫార్సుకు సమయం తీసుకునేందుకు తనకు ఇంకా స్వేచ్ఛ ఉన్నప్పటికీ... ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా అనుమతించినట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని తమిళిసై అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేందుకు అనుమతించినట్లు తెలిపారు.