'నూతన సచివాలయం అద్భుతం.. కానీ ఆహ్వాన పత్రికైనా పంపలేదు' Governor Tamilsai interesting comments : గత కొన్నిరోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి మధ్య విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. పెండింగ్ బిల్లుల విషయంలోను గవర్నర్‌కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య రగడ నడిచింది. పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించాలని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పలు కార్యక్రమాలలోను గవర్నర్.. కేసీఆర్‌పై బహిరంగంగానే విమర్శించారు.
తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరయిన తమిళిసై.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నూతన సచివాలయం అద్భుతంగా నిర్మించారని కితాబిచ్చారు. కానీ సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని.. కనీసం ఆహ్వానపత్రిక పంపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్తీరాన అంబేడ్కర్ జయంతి రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని గవర్నర్ అన్నారు. రాజ్‌భవన్‌లోనే ఉండి అంబేడ్కర్‌కు నివాళులు అర్పించానన్నారు.
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం వివాదాస్పదం అవుతోందన్నారు. ప్రధాని చేతులమీదుగా గాకుండా.. రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు అంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధంలేదని అంటున్నారన్నారు. గవర్నర్లు... రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అని తమిళిసై అన్నారు.
"ప్రత్యేకించి తమిళనాడు, తెలంగాణలో రాజ్యాంగబద్ధ వ్యక్తులను ఎలా అవమానిస్తున్నారో చూస్తున్నాం. కానీ ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారితో ప్రారంభించాలని అంటున్నారు. వారు వ్యవహరిస్తున్న తీరుకు ఇది పూర్తిగా విరుద్ధం. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ విషయంలో వారు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగబద్ధపదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించని వారు.. రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తారని కొందరు అడుగుతున్నారు." - తమిళిసై, తెలంగాణ గవర్నర్
పార్లమెంట్ ప్రారంభోత్సవంపై విపక్షాల ఏకగ్రీవ తీర్మానం.. పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ, డీఎంకే, శివసేన-యూబీటీ, జేఎంఎం, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలనే డిమాండ్‌ను విపక్షాలు లేవనెత్తుతున్నాయి.
నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం.. అనేది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోదీకి కొత్తేం కాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక నూతన భవనంలో తమకు ఏ విలువా కనిపించడం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ చదవండి: