ముస్లింలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్.. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ను భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని కోరారు. ఈ పండుగ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని గవర్నర్ ఆకాక్షించారు. బక్రీద్ పర్వదినం త్యాగాలకు ప్రతీకని కొనియాడారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసం కలిగి.. సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తమకు ఉన్న దాంట్లో ఇతరులకు పంచిపెట్టడం కంటే మించిన దాతృత్వం లేదనే స్పూర్తిని కలిగిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ తరహాలో బక్రీద్‌ను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. ఇస్లాం ధర్మాన్ని ప్రపంచంలో కోట్లాది మంది అవలంభిస్తున్నారని.. శాంతి, సహనం, దయ, కరుణ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వాన్ని బోధిస్తుందని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా పూర్వీకులను కొలుస్తారని చెప్పారు.