రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో స్వయంగా వైద్యురాలైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారిని గవర్నర్ రాజ్ భవన్కు పిలిచారు.
గవర్నర్ ట్వీట్
ఈ విషయాన్ని తమిళిసై స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ ఐసోలేషన్ వసతి కల్పిస్తున్న ఆసుపత్రుల ప్రతినిధులతో ఇవాళ ఉదయం 11 గంటలకు తమిళిసై చర్చిస్తారు. కరోనా చికిత్స సహా సంబంధిత అంశాలపై గవర్నర్ చర్చించనున్నారు. పరీక్షలు, పడకలు, బిల్లులకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఈ విషయాలను కూడా తమిళిసై ట్వీట్ చేశారు. గవర్నర్ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు... కరోనా చికిత్స, తదితరాలకు సంబంధించిన పలు సమస్యలు, అంశాలను ప్రస్తావించారు.