Tamilisai Soundararajan visited Osmania Hospital : హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. ఆసుపత్రిలో పరిస్థితులను చూసి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత భవన పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాత భవంతిలో రోగులు లేరని వైద్యులు గవర్నర్‌కు చెప్పారు. పెరిగిన రోగులకు బెడ్స్ ఏర్పాటుపై గవర్నర్ ఆరా తీశారు. మంత్రి హరీశ్‌రావుతో సమీక్ష దృష్ట్యా సూపరింటెండెంట్ నాగేంద్ర అందుబాటులో లేరు. అనంతరం మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో ఒక్కో బెడ్ మీద ఇద్దరు నుంచి ముగ్గురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలోని శౌచాలయాలకు సరైన తలుపులు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే సిబ్బంది కూర్చోవడానికి సరైన ప్రదేశం లేదని తెలిపారు. సరైన స్థలం లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసిన ఆమె.. కొత్త భవనం కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త భవంతి నిర్మాణానికి లీగల్ సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ పరిస్థితులు చూడాలని పేర్కొన్నారు. ఉస్మానియాకు కొత్తగా 3000 పడకలు అవసరమని సూచించారు.
- Governor Tamilisai on private universities bill : 'విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే బిల్లులు తిరస్కరించా'
- Harishrao Fires On Governor : 'గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది'
"ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించాను. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడుతున్నారు. ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నాను. రోజుకు 2000 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. రోజూ 200 వరకూ సర్జరీలు చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లవుతోంది. ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనం కట్టాల్సిన అవసరముంది. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు చెప్పారు. నేను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదు. వైద్యులు, సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు." - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్