Governor on Pending Bills Issue: పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విటర్ వేదికగా స్పందించారు. రాజ్‌భవన్.. దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి సమయం లేదా అని ప్రశ్నించిన గవర్నర్.. ప్రొటోకాల్ లేదు, అధికారికంగా రాలేదన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్ కలవలేదన్న తమిళిసై సౌందరరాజన్.. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.
''రాజ్‌భవన్ దిల్లీ కంటే దగ్గరగా ఉంది. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి సమయం లేదా? అధికారికంగా రాలేదు, ప్రొటోకాల్ లేదు. కనీసం మర్యాద పూర్వకంగా కూడా సీఎస్ కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి.''-ట్విటర్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
ఇదీ అసలు విషయం.. 2022 సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి.. ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మిగతా ఏడు బిల్లులను అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంచారు. దాదాపు 6 నెలలుగా 7 బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లోనే ఉండగా.. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరో 3 బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వీటికీ ఆమోద ముద్ర పడకపోవడంతో గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
శాసన సభ, శాసన మండలి ఆమోదించుకున్న బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలంటూ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. బిల్లులను రాజ్‌భవన్‌కు పంపి దాదాపు 6 నెలలు కావస్తుండటంతో విధి లేకే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. చాలా కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే గవర్నర్ పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులకు ఆమోదముద్ర వేసేలా ఆదేశించాలని కోరింది.