వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చి రైతుల ఆదాయాలు రెండింతలు చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు అత్యంత కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన 5వ స్నాతకోత్సవంలో వర్సిటీ కులపతి హోదాలో గవర్నర్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ స్నాతకోత్సవానికి పుదుచ్చేరి నుంచి గవర్నర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్.రమేష్‌చంద్ హాజరవగా... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు... వార్షిక నివేదిక సమర్పించారు.
విద్యార్థులకు డిగ్రీలతో పాటు పతకాలు
ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో ఒకేసారి 176 మంది పీజీ విద్యార్థులు, 435 మంది బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు, 82 మంది బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు, 41 మంది బీఎస్సీ కమ్యూనిటీ విద్యార్థులు, 21 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు డిగ్రీలు ప్రధానోత్సవం చేశారు. యూజీ, పీజీ విద్యార్థులకు 29 బంగారు పతకాలు అందజేశారు. కంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థి పి.మానసకు ఏడు బంగారు పతకాలు లభించాయి. రుద్రూర్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ విద్యార్థి కె.పద్మశ్రీ, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థి గాయత్రికి మూడు చొప్పున బంగారు పతకాలు వరించాయి. అలాగే, పద్మశ్రీకి పీజేటీఎస్‌ఏయూ అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ గోల్డ్ మెడల్ లభించింది. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్‌చంద్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రధానం చేశారు.