గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు మాతృ వియోగం కలిగింది. తమిళిసై తల్లి కృష్ణకుమారి(80) మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారిని రెండు రోజుల క్రితం సోమజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు కృష్ణకుమారి పార్థివదేహాన్ని రాజ్ భవన్ నుంచి చెన్నైకు తరలించి... అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
కృష్ణకుమారి భౌతికకాయాన్ని రాజ్‌భవన్‌కు తీసుకువచ్చారు. కృష్ణకుమారి పార్థివదేహానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి రాజ్ భవన్‌కు చేరుకొని... భౌతిక కాయానికి పూలమాల వేశారు. అనంతరం నివాళులు అర్పించి... గవర్నర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా కృష్ణకుమారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
పలువురు ప్రముఖుల సంతాపం..
గవర్నర్ తమిళిసై తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కృష్ణకుమారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.