డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ కాన్సులేట్ సహకారంతో ప్రజ్వల ఫౌండేషన్ ప్రచురించిన కౌంటరింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించారు. మానవ అక్రమ రవాణా ద్వారా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. దీనివల్ల అమాయకులు జీవితాలు బలవుతున్నాయని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాలో 46 శాతం మంది మహిళలు, 19 శాతం మంది అమ్మాయిలు బాధితులు అవుతున్నారని గవర్నర్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఏ సమయంలోనైనా కనీసం రెండున్నర మిలియన్ల మంది మానవ అక్రమ రవాణాలో బాధితులు జీవితాలు గడుపుతున్నారని తమిళిసై వివరించారు. మానవ అక్రమ రవాణా నుంచి కాపాడిన బాధితులను వివక్షకు గురి చేయకుండా వారి పునరావాసం కోసం కృషి చేయాలని గవర్నర్ సూచించారు. బాధితుల సమస్యలు, అనుభవాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా మానవ అక్రమ రవాణా ఎలా అరికట్టాలో సరైన ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరముందని వివరించారు.