Governor Tamilisai Soundara Rajan Speech in Assembly : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundara Rajan) ప్రసంగించారు. పద్మ విభూషణ్ కాళోజీ పలుకులతో గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. నూతన సర్కార్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. ప్రజా సేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ : సీఎం రేవంత్ రెడ్డి
జీవితాల్లో గొప్ప మార్పులు రావాలని ప్రజలు ఆశించారని తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. మార్పు కోసం వారు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు, పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అని చెప్పారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగాయని అన్నారు. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వం వచ్చిందని వివరించారు. ఎన్నో ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు.
"రైతులు, యువత, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాం. అభివృద్ధిలో రాష్ట్రం మరింత దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు, ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇండ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మారుస్తాం." - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్
'గత ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేసింది. అప్పులపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. తెలంగాణ సర్కార్ అప్పులపై ప్రజలకు వాస్తవాలు చెబుతాం. హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారు. తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారెంటీలు అమలు చేశాం' అని తమిళిసై పేర్కొన్నారు.