Governor Tamilisai on TSRTC Bill : టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటిని నివృత్తి చేయాలని గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని పేర్కొన్నారు.
విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్ ఇస్తారా? అని అన్నారు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు? అని వివరించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ తమిళిసై కోరారు.
RajBhavan On TSRTC Merging Bill : ఈ బిల్లును శుక్రవారమే శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ గవర్నర్ అనుమతి లభించకపోవడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కాలయాపన చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే శనివారం రాజ్‌భవన్ వద్ద ఆందోళనలకు టీఎంయూ పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి.. దీనిపై రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును గవర్నర్ క్షుణ్నంగా పరిశీలించారని తెలిపింది. సందిగ్ధత ఉన్న కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరణ అవసరమని తమిళిసై సౌందర రాజన్ భావిస్తున్నారని చెప్పింది. ప్రభుత్వం నుంచి వివరణలతో కూడిన సమాధానం వెంటనే వస్తే.. బిల్లుపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
Tamilisai Did Not Approve TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
Governor Tamilisai on Telangana RTC Bill :మరోవైపు ఆర్టీసీ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కార్.. ముసాయిదాను గవర్నర్‌కు పంపినా అనుమతి రాలేదు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీముసాయిదా బిల్లు ఈ నెల 2న మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరిందని తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ మాత్రమే అభ్యర్థించారని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన సలహాలు పొందాల్సిన అవసరముందని.. బిల్లుపై సంతకం చేసేందుకు మరింత సమయం కావాలని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారని ఆ ప్రకటనలో వివరించారు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో మరో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై హైదరాబాద్‌లో లేరు.