National Cultural Festival: భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు దోహదం చేస్తాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్ స్టాల్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు.
జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్సవాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ చాలా బాగున్నాయని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు.
ప్రజలందరూ తరలిరావాలి.. కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి ఉంచేది సంస్కృతి. తెలంగాణకు వచ్చిన సహోదరులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. -తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్