కార్పొరేట్ రంగంతో పాటు వివిధ వ్యవస్థల్లో పైస్థాయిలో మహిళా నాయకత్వం చాలా తక్కువగా ఉందని గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందాల్లో మహిళలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అప్పుడే మహిళలకు సమాన ప్రాతినిధ్యం దొరుకుతుందని, లింగ వివక్ష తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరంను గవర్నర్ (Tamilisai) చెన్నై నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
మొత్తం ఎంటర్ ప్రెన్యూర్లలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారని... ఎంటర్ ప్రెన్యూర్షిప్ పెంపొందించేందుకు మరింతగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం అయితే భారతదేశ జీడీపీ ఎన్నో రెట్లు పెరుగుతుందని వివరించారు. పురుషులకు మాత్రమే సొంతం అనుకున్న అనేక రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారని తమిళిసై వివరించారు.