తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor tamilisai: ఆ దంపతులకు గవర్నర్ ప్రత్యేక సత్కారం.. ఎందుకంటే?

విశ్రాంతి తీసుకునే వయసులో సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న గంగాధర్​ తిలక్​ దంపతుల సేవలు స్ఫూర్తిదాయకమని గవర్నర్​ తమిళిసై కొనియాడారు. పదేళ్లుగా రోడ్లపై గుంతలు పూడుస్తూ ప్రమాదాల నివారణకు కృషిచేస్తున్న ఆ దంపతులను గవర్నర్​ సత్కరించారు. ఈ మేరకు వారిని రాజ్​భవన్​కు ఆహ్వానించి వారితో ముచ్చటించారు.

gangadhar couple, governor tamilisai
గంగాధర్​ దంపతులు

By

Published : Jul 14, 2021, 8:09 PM IST

రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్లపై గుంతలు పూడ్చటమే లక్ష్యంగా చేసుకొని.. సొంత ఖర్చులతో గుంతలు పూడుస్తున్న కె.గంగాధర్ తిలక్‌ సేవలు స్ఫూర్తిదాయకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. ఎక్కడైనా రోడ్లపై ఏర్పడే ప్రమాదకరమైన గుంతలను పూడ్చే పనిని స్వచ్ఛందంగా చేపట్టిన గంగాధర్ దంపతులను గవర్నర్​ సత్కరించారు. రాజ్‌భవన్‌ దర్బార్ హాల్​లో ఇరువురికి జ్ఞాపికలు బహుకరించారు.

గంగాధర్​ దంపతులకు గవర్నర్​ సత్కారం, జ్ఞాపిక బహుకరణ

గంగాధర్, ఆయన భార్య వెంకటేశ్వరి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై గవర్నర్​ హర్షం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలం నుంచి చేస్తుండటం అభినందనీయమని వ్యాఖ్యానించారు. గంగాధర్​ను "రోడ్ డాక్టర్"​గా అభివర్ణించారు. ఆ దంపతులను ఈ కాలం "అన్ సంగ్ హీరోస్"గా పేర్కొన్నారు. ఈ వయసులో సొంత ఖర్చులతో ఎంతో ఓపికగా సేవలు చేయడాన్ని అభినందించారు. రోడ్లపై గుంతలు పూడ్చడం ఒక ఉద్యమంగా చేపట్టిన గంగాధర్ దంపతులు అందరికీ స్ఫూర్తిదాయకమని తమిళిసై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, సంయుక్త కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గంగాధర్​ దంపతులు, అధికారులతో ముచ్చటిస్తున్న గవర్నర్​

రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను చూసి చలించిన గంగాధర్ దంపతులు.. పదేళ్లుగా రోడ్లపై గుంతలు పూడ్చటాన్ని నిరాటంకంగా నిర్వర్తిస్తున్నారు. వారికొచ్చే పింఛను డబ్బులతో సమాజ హితం కోసం పాటుపడుతున్నారు.

ఇదీ చదవండి:High Court: 'అధికారుల వేతనాలు ఆ దంపతులకు ఇస్తే మేలు'

ABOUT THE AUTHOR

...view details