Governor Tamilisai Comments: తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. సీఎంవో నుంచి మంత్రికి లేఖ రావడానికి జాప్యమైతే సమస్యలు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతాయని నిలదీశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు. తన పర్యటనల గురించి ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నానని చెప్పారు. ప్రొటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రగతి భవన్ మాదిరిగా కాదు:రాజ్‌భవన్ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తున్నారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తారని విద్యార్థుల ఐకాస పేరిట వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. బాసర విద్యార్థులు వచ్చారని, మిగతా విద్యార్థులు తనను కలుసుకునేందుకు వచ్చారని గుర్తు చేశారు. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరుచుకుని ఉంటాయని.. ప్రగతిభవన్ మాదిరిగా కాదని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది..?:తన ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. తద్వారా ప్రైవసీకి భంగం కలుగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతోందనే అనుమానం ఉందని చెప్పారు. ప్రజా సమస్యల విషయంలో తాను సానుకూలంగా స్పందిస్తానని వెల్లడించారు. ఫాంహౌస్ కేసులోనూ తనను లాగే ప్రయత్నం చేశారరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాజీ ఏడీసీ తుషార్‌ను ఈ కేసులోకి తీసుకువచ్చిన కారణం అదేనని తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు .