Governor on Honor killing Case: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగిన నాగరాజు హత్యోదంతంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక కోరారు. మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు దారుణ హత్యకు గురయ్యారన్న మీడియా కథనాలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ పరువు హత్యపై మంత్రి కేటీఆర్ సైతం గురువారం స్పందించారు. నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
అసలేం జరిగిదంటే..:రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సేల్స్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు.. కొద్దినెలల కిందట ఆశ్రిన్‌తో కలిసి విశాఖపట్నంలో ఉంటూ.. ఇటీవలే హైదరాబాద్ సరూర్‌నగర్‌కు మకాం మార్చారు.
వీరి కదలికలపై కన్నేసిన ఆశ్రిన్ సోదరుడు.. తన బంధువు, స్నేహితుడితో కలిసి నాగరాజు హత్యకు పథకం రచించాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వీరు బైక్‌పై బయటకు వెళ్తుండగా.. బండి ఆపి మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు యువతి సోదరుడు, బావను పట్టుకుని అరెస్టు చేశారు.