CM KCR vs Governor Tamilisai: రాష్ట్ర సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య నడుస్తోన్న వివాదం తెలిసిందే.. అయితే తాజాగా తమిళిసై మరోసారి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రోటోకాల్ పాటించటం లేదని ఆరోపించారు. ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం చర్చించాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు.
కాలానుగుణంగా గవర్నర్‌తో సీఎం చర్చలు తప్పనిసరి అని సూచించారు. రెండేళ్లుగా సీఎం తనను సంప్రదించలేదని ఆరోపించారు. సీఎం, గవర్నర్ మధ్య సుహృద్భావ వాతావరణం లేదని ప్రకటించిన ఆమె.. సుహృద్భావ వాతావరణం లేకపోవడానికి తాను కారణం కాదని ప్రకటించారు.
వివాదం ఎప్పటిది:గవర్నర్, ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదం ఇప్పటిది కాదు. గత రెండేళ్లుగా ప్రగతిభవన్, రాజభవన్ మధ్య దూరం పెరిగింది. ఇది కాస్త సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసైగా అనే విధంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ నుంచి అనుమతి రాలేదని ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. 10రోజులు ముందే ఆమెకు లేఖ పంపించామని అయనప్పటికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. చివరికి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమై బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.
గత ఏడాది జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి.. ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్.. మిగతా 7 బిల్లులను అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంచారు. దీంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ తరువాత మరికొని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
Governor pending bills dispute: తాజాగా ఇవాళ పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మూడు బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అందులో ఒక బిల్లును తిరస్కరిస్తూ వెనక్కి పంపిన గవర్నర్.. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు.