తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ వేళ చురుగ్గా గవర్నర్​ తమిళిసై.. స్వయంగా రంగంలోకి.. - news on telangana governor

కొవిడ్ విపత్కర పరిస్థితుల వేళ గవర్నర్ తమిళిసై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలయిన ఆమె... పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వివిధ వర్గాల వారిని సంప్రదించడం సహా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

governor tamila sai
కొవిడ్ వేళ చురుగ్గా గవర్నర్​ తమిళిసై.. స్వయంగా రంగంలోకి

By

Published : Jul 15, 2020, 6:37 AM IST

డాక్టర్ తమిళిసై సౌందరరాజన్... రాష్ట్ర ప్రథమ పౌరురాలు. వృత్తిరీత్యా వైద్యురాలు కూడా. ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో గవర్నర్ తమిళిసై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో రాజ్​భవన్ నుంచే పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి.. అవసరమైన సాయం చేస్తూ వచ్చారు.

అన్‌లాక్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో కొవిడ్​ వైరస్​ విజృంభిస్తోంది. పలువురు వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన పడుతున్నారు. వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు గవర్నర్ తమిళిసై స్వయంగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి వారితో మాట్లాడారు. వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో మాట్లాడి కొవిడ్ నియంత్రణ, పరీక్షలు, చికిత్స విషయంలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. ఉన్నతాధికారులను పిలిపించుకొని రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చ..

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స, బిల్లుల విషయంలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో యాజమాన్యాలతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, మానవతా దృక్పథంతో సేవచేయాలని కోరారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్‌తో ఫోన్లో మాట్లాడి హైదరాబాద్ ఈఎస్​ఐ వైద్య కళాశాలకు అదనపు పరీక్షల నిర్ధరణ యంత్రాన్ని, వెంటిలేటర్లతో కొవిడ్ ఐసీయూలు ఇవ్వాలని కోరారు. మంజూరుకు అంగీకరించిన కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈఎస్​ఐ వసతి లేని పేదలకూ డయాగ్నస్టిక్ సేవలు ఉచితంగా పొందే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అవగాహన కార్యక్రమాలు..

ఇదే సమయంలో కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా ప్రాథమిక లక్షణాలను గుర్తించేందుకు ఇంటివద్దే స్వయంగా పరీక్షలు చేసుకోవచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా అవగాహనలో భాగంగా ఈ మేరకు గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. శరీర ఉష్ణోగ్రతలు 98.4 ఫారెన్ హీట్ కంటే తక్కువగా ఉండాలని, పల్స్ రేటు 70 నుంచి 80 వరకు ఉండాలని తమిళిసై తెలిపారు. శ్వాసరేటు నిమిషానికి పెద్దలకు 16 నుంచి 18 వరకు, పిల్లలకు 20 నుంచి 25 వరకు ఉండాలని అన్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 95 నుంచి 100 శాతం వరకు ఉండాలని చెప్పారు. ఇందులో ఏమైనా మార్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరీక్ష చేయించుకోవాలని గవర్నర్ సూచించారు.

ఇవీచూడండి:ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు.. టీవీల ద్వారా బోధన

ABOUT THE AUTHOR

...view details