రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రంగాల నిపుణులు, సంబంధిత వ్యక్తులతో గవర్నర్ తమిళిసై దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, అపోలో ఆస్పత్రి ప్రెసిడెంట్ హరిప్రసాద్‌తోపాటు ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, కొవిడ్ చికిత్స నిపుణులు స్వామినాథన్, కొవిడ్ బారిన పడి ప్లాస్మా చికిత్స పొందిన వంశీమోహన్ సమీక్షలో పాల్గొన్నారు.
ఐసీఎంఆర్ నిబంధనలకు మాత్రమే పరిమితం కాకుండా
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. పరీక్షల విషయంలో కేవలం ఐసీఎంఆర్ నిబంధనలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని... కాంటాక్టులను పక్కగా గుర్తించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. వైరస్ లక్షణాలతో మరణించిన మృతుల తరఫు కుటుంబసభ్యులకు... సత్వర పరీక్షలు చేయడం ద్వారా వారిని ఐసోలేషన్‌లో ఉంచవచ్చని పేర్కొన్నారు.
యాంటీబాడీ పరీక్షలు చేయాలి
రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లలో లక్షణాలు లేకున్నా పరీక్షలు నిర్వహించాలని, సామాజిక వ్యాప్తి జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధరించేందుకు..... యాంటీబాడీ పరీక్షలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఫ్రంట్ లైన్ వారియర్‌లైనా వైద్యులు, సిబ్బంది, పోలీసులతో పాటు పారిశుధ్య కార్మికులు, మీడియా సిబ్బందికి తరచూ పరీక్షలు నిర్వహించాలని సమీక్షలో గవర్నర్‌కు సూచించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు వైద్యులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. వీటితో పాటు ఔషధాలు, పడకల లభ్యతను దృష్టిలో ఉంచుకొని చికిత్స కోసం మార్గదర్శకాలు రూపొందించాలన్న నిపుణులు... ప్లాస్మా థెరపీని కొనసాగించాలని సూచించారు.
పీజీ వైద్య విద్య సహా అన్ని పరీక్షలను వాయిదా వేయాలి
కొవిడ్ చికిత్సను వికేంద్రీకరించటంతోపాటు చికిత్స అందించే ఆస్పత్రుల సంఖ్య పెంచాలని ఈ సందర్భంగా నిపుణులు సలహా ఇచ్చారు. భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం లాంటి విషయాల్లో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని... యోగాను ప్రోత్సహించడంతో పాటు ప్రజలు రోగనిరోధకశక్తిని పెంచే ఔషధాలు ఉపయోగించేలా చూడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీజీ వైద్య విద్య సహా అన్ని పరీక్షలను వాయిదా వేయాలని.... టెలీమెడిసిన్ సేవలను ఇంకా విస్తృతం చేయాలని అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల