ఏటావేలాది మందికి ఉన్నత విద్య అందిస్తున్న జేఎన్‌టీయూ- హైదరాబాద్ 50వ వసంతంలోకి అడుగుపెట్టడంతో నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ స్వర్ణోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబరు 2 వరకు వివిధ విభాగాల తరఫున దశలవారీగా కార్యక్రమాలు జరుపుతామని పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భాగస్వాములు కానున్నట్లు వెల్లడించారు.
జేఎన్‌టీయూని 1972 అక్టోబరు 2న ప్రారంభించారు. తొలుత అనంతపురం, హైదరాబాద్, కాకినాడ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. 1992లో జేఎన్‌టీయూ చట్టాన్ని సవరిస్తూ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే హోదాను కల్పించారు. 2008 ఆగస్టు 18న ప్రత్యేక ఆర్డినెన్స్‌తో జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాన్ని నాలుగు వర్సిటీలుగా విభజించారు. జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురం, అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏర్పడ్డాయి. ప్రస్తుత క్యాంపస్ 89 ఎకరాల్లో ఏర్పాటైంది. 18 విభాగాలలో బీటెక్ కోర్సులు, 46 విభాగాల్లో ఎంటెక్, బీఫార్మసీ కోర్సులు, 9 విభాగాల్లో ఎంఫార్మసీ కోర్సులు, ఎంసీఏ, ఎంబీ, ఫార్మాడీ, ఫార్మాడీ(పీబీ) కోర్సులున్నాయి.
చదువుకున్న ప్రముఖులెందరో..
జేఎన్‌టీయూలో చదివిన విద్యార్థులెందరో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. సొంతంగా పరిశ్రమలు స్థాపించడమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రాణిస్తున్నారు. ప్రస్తుత డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో మాజీ డీజీ అవినాశ్ చందర్, మాజీ డీజీ టెస్సీథామస్ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఐఏఎస్ అధికారులు జేఆర్‌కే రావు, పి.రాఘవేందర్‌రావు, గోపాల్‌రెడ్డి, వంశీ, బీపీవో సీఈవో విజయ్ రంగినేని, బీడీఎల్ మాజీ డైరెక్టర్ కె.దివాకర్, కేంద్ర ఎంఎస్‌ఎంఈ మాజీ సంచాలకుడు అర్వింద్ పట్వారి, డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ వై.శ్రీనివాసరావు సహా ఎంతో మంది ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారిక్కడే.
కాలానుగుణంగా కోర్సులు