ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ్ దత్ తివారీ రాజీనామా కారణంగా ఖాళీ అయిన స్థానంలో గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు ఈఎస్ఎల్ నరసింహన్. అప్పటి వరకు ఛత్తీస్గఢ్ గవర్నర్‌గా ఉన్న ఆయన 2009 డిసెంబర్ 29న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012 మే 3వ తేదీన నరసింహన్ రెండోసారి గవర్నర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో యూపీఏ ప్రభుత్వానికి నమ్మిన బంటుగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనూ సమావేశమై విమర్శల పాలయ్యారు. ఉద్యమం తారస్థాయికి చేరుకోవడం, నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తోన్న తరుణంలో నరసింహన్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీరణ చట్టం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడం వల్ల సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి పాలన వచ్చింది. గవర్నర్‌గా నరసింహన్ రాష్ట్ర పాలనను నడిపించారు.
యూపీఏ ప్రభుత్వంలోనే కాదు, ఎన్డీఏ సర్కారులోనూ...
2014 సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. విభజన అనంతర పరిణామాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని తన అవసరాన్ని గుర్తు చేసేలా కేంద్రాన్ని ఆకట్టుకునేలా వ్యవహరించిన నరసింహన్... వారి విశ్వాసాన్నీ చూరగొన్నారు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చినప్పటికీ నరసింహన్‌ను మోదీ ప్రభుత్వం కొనసాగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఆయనే సరైన వ్యక్తని నమ్ముతూ వచ్చింది. విభజన వివాదాల కారణంగా గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. విద్యుత్, నీరు, ఉద్యోగులు, భవనాలు, సంస్థల విభజన అంశాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరుపుతూ కృష్ణా జలాలు, సాగర్ వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు. అయితే 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పలుమార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ నరసింహన్ ఏమీ చేయలేదన్న విమర్శలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను వెనకేసుకొస్తున్నారంటూ ఏపీ మంత్రులు విమర్శల వర్షానికి దిగారు. పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అధికార పార్టీలు మంత్రివర్గంలో చేర్చుకోవడం తదితర అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
నలుగురు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం...