మహమ్మారి సమయంలో కొవిడ్ యోధుల సేవలు ఆదర్శప్రాయమైనవని, విపత్తు వేళ చాలా మంది ప్రాణాలను కాపాడగలిగారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా 75 మంది కొవిడ్ వారియర్లతో గవర్నర్ రాజ్‌భవన్ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ఎట్ హోం నిర్వహించారు. కొవిడ్ వారియర్స్ నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణలుగా నిలిచారని కొనియాడారు. వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరులను రక్షించారన్నారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, సివిల్ సొసైటీ వాలంటీర్లు, ఇతరులు కూడా ఆదర్శప్రాయమైన సేవలను అందించారని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. స్వదేశీ వ్యాక్సిన్‌ను విడుదల చేసినందుకు భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ సుచిత్రా ఎల్లా, ఇతరుల సేవలను గవర్నర్ ప్రశంసించారు.
GOVERNOR: కొవిడ్ వారియర్లతో గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమం
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా 75 మంది కొవిడ్ వారియర్లతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ఎట్ హోం నిర్వహించారు. మహమ్మారి సమయంలో కొవిడ్ యోధుల సేవలు ఆదర్శప్రాయమైనవని, వారివల్ల అనేక విలువైన ప్రాణాలను కాపాడగలిగారని ఆమె కొనియాడారు.
నాసికా టీకాలు, పిల్లలకు టీకాల కోసం వారి పరీక్షలు త్వరలో విజయవంతమవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆరోగ్యకరమైన, మెరుగైన జీవనశైలిని అవలంభించుకోవాలని గవర్నర్ సూచించారు. భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా కొవిడ్ మహమ్మారి సమయంలో 75,000 కంటే ఎక్కువ యూనిట్ల భారీ రక్త సేకరణను గవర్నర్ గుర్తుచేసుకుంటూ...తలసేమియా ప్రభావిత పిల్లల ప్రాణాలను కాపాడిన వారిని ప్రశంసించారు. ఐఆర్‌సీఎస్ ప్రతినిధులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి, డాక్టర్ పిచ్చి రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, మేజర్ జనరల్ ప్రీత్పాల్ సింగ్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు..ప్లాస్మా దాత డాక్టర్ రూప తదితరులు దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్‌తో మాట్లాడారు.
ఇదీ చదవండి: Independence Day: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు