తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత రాబడులతోనే గట్టెక్కేందుకు సర్కారు యత్నం

కరోనా కష్టకాలంలో అండగా ఉంటుందని ఆశించిన కేంద్రం.. నిరాశే మిగిల్చింది. రాష్ట్రానికి రావాల్సిన మొత్తంలోనూ కోత విధించింది. ఫలితంగా కేంద్రంపై ఆధారపడకుండా.. సొంత రాబడులతోనే గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది.

By

Published : May 9, 2020, 6:57 AM IST

Updated : May 9, 2020, 7:12 AM IST

Government's focus on own returns
సొంత రాబడులతోనే గట్టెక్కేందుకు సర్కారు యత్నం

కరోనా కాలంలో కేంద్రం ఆదుకుంటుందని ఆశించినా రాష్ట్రానికి నిరాశే మిగిలింది. రావాల్సిన మొత్తంలోనూ కోతపడింది. మరోవైపు రాష్ట్రం ఖర్చు చేయాల్సిన మొత్తం పెరుగుతుండగా ఏప్రిల్‌ రాబడులు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు నెల క్రితం హెలికాప్టర్‌ మనీ లేదా క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూయీ) విధానాన్ని కూడా సూచించారు.

కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాబడులు తగ్గడం వల్ల రాష్ట్రాలకు పన్నుల వాటానూ కేంద్రం తగ్గించింది. ఫలితంగా ఏప్రిల్‌ నెలలో తెలంగాణకు వచ్చింది రూ.982 కోట్లు మాత్రమే. ఈ నెలలో ఎంత వస్తుందో స్పష్టత లేదు. కేంద్రం ఇవ్వాల్సిన విపత్తు నిర్వహణ నిధులు రూ.450 కోట్లను మాత్రం రెండు విడతల్లో పూర్తిగా అందజేసింది. జీఎస్టీ పరిహారం కూడా నామమాత్రంగానే అందింది. మే నెలలో కేంద్రం నుంచి పన్నుల వాటా మాత్రమే కచ్చితంగా వస్తుందని.. కేంద్ర పథకాలకు ఎంతమేర వస్తుందనే అంశంతో పాటు ఇతర ఆర్థిక తోడ్పాటుపై నమ్మకంలేదని అధికారులు పేర్కొంటున్నారు.

రూ.2,600 కోట్లకు రూ.269 కోట్లు..

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిహారం పూర్తిగా అందితే రాష్ట్రానికి రూ.2,600 కోట్లు రావాలి. కేంద్రం నుంచి వచ్చింది రూ.269 కోట్లే. కేంద్రానికి జీఎస్టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో పరిహారంలో పది శాతం మాత్రమే అందించింది. జీఎస్టీ పరిహారం పూర్తిగా ఇచ్చి, కేంద్ర పన్నుల వాటా కూడా మే నెలలో మొత్తం ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్రం నుంచి భరోసా లేకపోవడం వల్ల సొంత ఆదాయ వనరులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం వల్ల సాధారణ పరిస్థితి నెలకొంది. నిర్మాణరంగ సామగ్రి, మద్యం, పెట్రోలు, డీజిల్‌ అమ్మకంతో పాటు రిజిస్ట్రేషన్‌ రాబడులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గనుల రాబడిపై దృష్టి పెట్టింది. ఇసుక విక్రయాలు మొదలయ్యాయి. అయితే రాష్ట్ర ఖజానాకు వెన్నుదన్నుగా ఉండే హైదరాబాద్‌లో పూర్తిగా కార్యక్రమాలు మొదలైతేనే రాబడులు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా గత ఏడాది సగటున నెలకు రూ.600 కోట్లు రాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చింది కేవలం రూ.2 కోట్లు. రవాణా శాఖ ద్వారా నెలకు రూ.300 కోట్లు పైగా రాగా ఈ ఏప్రిల్‌లో రాబడే లేదు. పన్నేతర ఆదాయం నెలకు సగటున రూ.800 కోట్లుపైగా ఉండగా, ఈ ఏప్రిల్‌లో నామమాత్రమే. అన్ని రకాలుగా ఏప్రిల్‌లో వచ్చిన ఆదాయం రూ.1,000 కోట్లలోపే. మేలో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకావడం వల్ల కొంత ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

మే 12న బాండ్ల విక్రయం..

వేతనాలు, పింఛన్లు, కొవిడ్‌-19 వ్యయం, కరోనా నేపథ్యంలో పేదలకు ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు, రుణమాఫీ, రుణాలు, ఇతర చెల్లింపులకు రాష్ట్రానికి మేలో కనీసం రూ.12 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థికశాఖ అంచనా వేసింది. గత నెల బాండ్లద్వారా రూ.4,000 కోట్లను సమీకరించుకున్న ప్రభుత్వం.. మే 12వ తేదీ కూడా మరో 2వేల కోట్లు బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది. బడ్జెట్‌ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34 వేల కోట్ల రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది.

ఇదీచూడండి: కేంద్రం, ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే పరీక్షలు: ఈటల

Last Updated : May 9, 2020, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details