అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రులు సహా కొన్ని జిల్లా దవాఖానల్లో ఈ పరికరాలు అందుబాటులో ఉండగా.. కొత్తగా మరో 16 నెలకొల్పాలనే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ‘సీటీ స్కాన్’ను ప్రారంభించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అదనంగా ఒక్కోటి చొప్పున నెలకొల్పనున్నారు. ఇవి కాకుండా నిలోఫర్, టిమ్స్, నల్గొండ, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక సీటీ స్కాన్ పరికరాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తయినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఈ 9 చోట్ల పరికరాల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలో అందుబాటులోకి తీసుకురావడమే మిగిలినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఇటీవల ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ వైద్యఆరోగ్యశాఖకు రూ.15 కోట్లను విరాళంగా అందజేయడానికి ముందుకొచ్చింది. ఆ విరాళాన్ని నగదు రూపంలో కాకుండా సీటీ స్కాన్ పరికరాలు అందజేయాలని కోరగా.. సదరు సంస్థ కూడా అందుకు అంగీకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాల సమాచారం మేరకు.. విరాళ మొత్తంతో మరో 7 అత్యాధునిక ‘సీటీ స్కాన్’లను కొనుగోలు చేయొచ్చు. వీటిని ఛాతీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి, తాండూరు తదితర 7 ఆసుపత్రుల్లో నెలకొల్పాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో త్వరలోనే 16 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ సాధ్యమైనంత వేగంగా సీటీ స్కాన్ పరికరాలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖను ఆదేశించింది. తద్వారా రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులతోపాటు జిల్లా ఆసుపత్రుల్లో ‘సీటీ స్కాన్’లు అందుబాటులోకి వస్తాయని వైద్యఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.