3 Lakh Financial Help: రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చే పథకం ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతోంది. దీనికి అదనంగా సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నియోజకవర్గానికి మూడు వేల మందికి ఈ సాయం అందించనున్నట్లు పేర్కొంది.
సర్కార్ కసరత్తు: ఈ నేపథ్యంలో సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేవారికి ఆర్థిక సాయంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారుల నుంచి తాజాగా ప్రతిపాదనలు అందాయి. లబ్ధిదారులకు రూ. 3 లక్షల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇవ్వాలని.. నిబంధనల మేరకు ఇంటి నిర్మాణ కనీస విస్తీర్ణం 323 చదరపు అడుగులు ఉండాలని ప్రతిపాదించారు. గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో అధికారులు మూడ్రోజులు క్రితం సమావేశమయ్యారు. ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేయాలని మంత్రి సూచించినట్లు సమాచారం. సొంత ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 75 గజాలు.. పట్టణ, నగర ప్రాంతాల్లో కనీసం 50 గజాలు ఉండాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
త్వరలో స్పష్టత: ఈ పథకం విధివిధానాల గురించి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించాలని వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్ణయించారు. త్వరలో ఇద్దరు మంత్రుల సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని అనంతరం సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకుంటారని సమాచారం. రూ. 3 లక్షల సాయాన్ని.. ఇంటి నిర్మాణంలో.. బేస్‌మెంట్, గోడలు, శ్లాబ్, ఫినిషింగ్ వంటి నాలుగు దశల్లో రూ. 75 వేల చొప్పున ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో ఇల్లు పొందినవారు ఈ పథకం కింద అనర్హులని గృహనిర్మాణశాఖ పేర్కొంది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ నుంచి సమాచారం తీసుకొని దరఖాస్తుదారులకు గతంలో ఇళ్ల పథకంలో లబ్ధి జరిగిందా? లేదా? నిర్ధారించుకోవాలని సూచించింది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత పరిశీలనలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు, నగరాల్లో డివిజన్ సభలు పెట్టాలని అధికారులు చెప్పారు.