BALKA SUMAN: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ అనగానే కాంగ్రెస్, భాజపాలకు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. జాతీయ పార్టీలపై తమ పార్టీలో చర్చ పెడితే.. ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్‌లతో కలిసి బాల్క సుమన్ మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు భారత జాతికి ద్రోహం చేసిన పార్టీలుగా బాల్క సుమన్ అభివర్ణించారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదని.. ప్రాణం పోసే సంజీవని అని తెలిపారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షురాలికి ఈడీ నోటీసులు ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ ధీటుగా పోరాడటం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కొన ఊపిరితో ఉందన్న ఆయన.. కాంగ్రెస్‌ది అంతిమ యాత్ర.. తెరాసది జైత్రయాత్రగా పేర్కొన్నారు.
పద్ధతి మార్చుకోవాలి..: భాజపా ఉన్మాదాన్ని, దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతామని బాల్క సుమన్ హెచ్చరించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీల నేతలు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ డిమాండ్లకు కేంద్రం ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ అనగానే కాంగ్రెస్, భాజపాలకు వణుకు మొదలైంది. జాతీయ పార్టీపై మా పార్టీలో చర్చ పెడితే.. ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. భాజపా ఉన్మాదాన్ని, కాంగ్రెస్ దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతాం. ఆ రెండు పార్టీల నేతలు పద్ధతి మార్చుకోవాలి.-బాల్క సుమన్, ప్రభుత్వ విప్