తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ లేఅవుట్ల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధం - unauthorised layouts news

పట్టణప్రాంతాల్లో అనుమతి లేని లే-అవుట్ల సమగ్ర లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ మినహా మిగతా ప్రాంతాల్లో 3,167 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యికి పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్న సర్కార్... అన్ని లే-అవుట్లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది. మార్చి 1లోపు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.

government takes action on unauthorised layouts
అక్రమ లేఅవుట్ల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధం

By

Published : Feb 27, 2020, 5:44 AM IST

Updated : Feb 27, 2020, 9:05 AM IST

రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఏర్పాటు కావడం, స్థిరాస్తి వ్యాపారం జోరు మీద ఉన్నందున లే-అవుట్లు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి కొన్ని లే అవుట్లు వస్తోంటే... మరికొన్ని లే అవుట్లు ఎలాంటి నిబంధనలనూ పాటించడం లేదు. ఇష్టారీతిగా అనుమతి లేని లే అవుట్లు వస్తున్నాయి.

పట్టణప్రగతిలో భాగంగా..

పట్టణప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని కార్యక్రమంలో ఒక అంశంగా చేర్చింది. ఈ నేపథ్యంలో లే అవుట్ల విషయమై సర్కార్ దృష్టి సారించింది. అక్రమ లే అవుట్ల అంశం ఇటీవల ముఖ్యమంత్రి ప్రగతిభవన్​లో నిర్వహించిన పురపాలక సదస్సులోనూ ప్రస్తావనకు వచ్చింది.

అక్రమ లేఅవుట్ల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధం

1,078 ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు..

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అనుమతి లేని లే అవుట్ల వివరాలు సేకరించాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించి డీటీసీపీ ఇచ్చిన వివరాలను కూడా అధికారులకు పంపారు. డీటీసీపీ గణాంకాల ప్రకారం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధి మినహా మిగతా ప్రాంతాల్లో 1,078 అనుమతి లేని లే అవుట్లు ఉన్నాయి.

మొత్తం 3167.47 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ లే అవుట్లు ఉన్నట్లు నివేదిక చెప్తోంది. అత్యధికంగా కామారెడ్డిలో ఏకంగా 580 ఎకరాల విస్తీర్ణంలో 129 అనుమతి లేని లే అవుట్లు ఉన్నాయి. 107 పురపాలికల్లో కేవలం 22 చోట్ల మాత్రమే లేఅవుట్లు సక్రమంగా ఉన్నట్లు డీటీసీపీ నివేదిక చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అనుమతి లేని లేవుట్లకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం... మార్చి ఒకటో తేదీని ఇందుకు గడువుగా విధించింది.

ఇదీ చదవండిఃవిద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!

Last Updated : Feb 27, 2020, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details