Govt Alert On Seasonal Diseases: రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టినట్లు పేర్కొంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వివరించింది.
ప్రతి శుక్రవారం డ్రై డే: సీజనల్ వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఇతర సంస్థల్లో ప్రతి శుక్రవారం డ్రై డే లాంటి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని కలెక్టర్లను ఇటీవల మంత్రులు కోరారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల ప్రత్యేక ప్రచారాన్ని కూడా పునరుద్ధరించాలన్నారు. సాధారణ పారిశుద్ధ్యం, డ్రైన్ క్లీనింగ్, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేసేలా కమిషనర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని పురపాలకశాఖ అధికారులకు స్పష్టం చేశారు.
హాస్టల్ వార్డెన్లదే బాధ్యత: దోమలు, లార్వా నిరోధక చర్యలను వేగవంతం చేయాలని... నీటి ఎద్దడి నివారణ, డ్రైన్ క్లీనింగ్, చెత్త ఎత్తివేయడం, గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీలు, ఆరోగ్య సిబ్బందిని క్రియాశీలం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బోరు బావుల పరిసర ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, కుళాయి, బోరు బావుల వద్ద నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయాల్లో హాస్టల్ వార్డెన్లు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.