Government Survey On Extramarital Affairs : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో అడుగుతున్న ప్రశ్నలు పరాకాష్ఠకు చేరాయి. ‘‘మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా? బహుళ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా? వీటికి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా?’’ అని అడుగుతున్నారు. ‘నేరాలకు దారితీసే అవకాశం ఉన్న పాత విరోధాల వివరాల సేకరణ’ పేరిట ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇంటింటికీ వెళ్లి మరీ ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలు వేస్తోంది.
మహిళా పోలీసులు వాలంటీర్లతో కలిసి తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఈ వివరాలు రాబడుతున్నారు. ఈ ప్రశ్నలు అడగటానికి మహిళా పోలీసులు కొంత ఇబ్బంది పడుతుండగా, ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు ఒక్కోసారి ఆయా ఇళ్లలోని వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇవేకాకుండా ఆ ఇంట్లోని వ్యక్తులకు సంబంధించి ఆస్తి, సరిహద్దు వివాదాలు, గృహహింస కేసులు, మద్యసేవనం, ఈవ్‌టీజింగ్, బహిరంగ మద్యపానం, కుల, మత, రాజకీయపరమైన విరోధాలకు సంబంధించిన కేసుల వివరాలూ సేకరిస్తున్నారు.