తెలంగాణ

telangana

ETV Bharat / state

Government doctors : 'డుమ్మా కొడితే ఇకపై సహించం.. ప్రైవేటులో ఉంటే కఠిన చర్యలు' - వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

Government doctors : ఇకపై ప్రభుత్వ వైద్యులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సర్కారు సేవల సమయంలో ప్రైవేటులో ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఏ విభాగపు వైద్యుడు ఏరోజు ఏం పనిచేస్తున్నారనే సమాచారాన్ని నిత్యం పరిశీలిస్తుంటామని పేర్కొంది. ఈ మేరకు వైద్యశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలను.. ఇటీవల బోధనాసుపత్రుల్లో సమీక్షల సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా వైద్యులకు వెల్లడించినట్లు తెలిసింది.

Government doctors
సర్కారు సేవల సమయంలో ప్రైవేటులో ఉంటే కఠిన చర్యలు

By

Published : Dec 16, 2021, 5:45 AM IST

Government doctors : పనితీరునే ప్రామాణికంగా పరిగణిస్తామనీ, విధుల్లో అలసత్వం సహించేది లేదనే సందేశాన్ని వైద్యశాఖ ఇప్పటికే వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. వైద్యుడెంత అనుభవజ్ఞుడైనా విధులను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన వైఖరి తప్పదనే హెచ్చరికలు చేసింది. ఏ విభాగపు వైద్యుడు ఏరోజు ఏం పనిచేస్తున్నారనే సమాచారాన్ని నిత్యం పరిశీలిస్తుంటామని పేర్కొంది. సర్కారు దవాఖానాల్లో సేవలందించాల్సిన సమయాల్లో.. ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పింది. ఇలాంటి వారిపై అవినీతి నిరోధక శాఖ(అనిశా)తో దాడులు చేయించడానికీ వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్యశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలను.. ఇటీవల బోధనాసుపత్రుల్లో సమీక్షల సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా వైద్యులకు వెల్లడించినట్లు తెలిసింది.

ప్రతి సేవకూ గుర్తింపు.

strict rules in hospitals: ఆసుపత్రికి వచ్చే ఓపీ, ఐపీ సేవలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒక్కో వైద్యుడు ఎంతమందిని ఓపీలో, ఐపీలో చూస్తున్నారు? రోజుకెన్ని శస్త్రచికిత్సల్లో పాల్గొంటున్నారు? వైద్యవిద్యార్థుల బోధనకు ఎంత సమయం కేటాయిస్తున్నారు?.. తదితర అంశాలన్నింటినీ ఇక క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఇందులో విభాగాల వారీగా పనితీరును లెక్కిస్తారు. ఓపీ సేవల్లోకి అనుభవజ్ఞులు వెళ్లకుండా వైద్యవిద్యార్థులపైనే వదిలేసే విధానానికీ స్వస్తి పలకాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతి వైద్యుడూ నిర్దేశిత తేదీల్లో కచ్చితంగా ఓపీలో రోగులను చూడాలనే నిబంధనను అమలు చేయనున్నారు. ఉత్తమ సేవలందించే వైద్యులకు ప్రోత్సాహకాలనూ అందించనున్నారు.

సమయపాలన తప్పనిసరి..
govt on doctors: వైద్యులు సమయపాలన పాటించకపోవడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో ఉండాల్సిన సమయంలో.. ప్రైవేటులో తరిస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ‘‘విధులకు రాకపోగా.. ఇతరుల సేవలకూ ఆటంకం కలగచేస్తున్నారు. సూపరింటెండెంట్లపై ఎదురు తిరుగుతున్నారు. మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా కూడా గుర్తించామ’’ని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై మంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కనాడూ వైద్యుడిగా సేవలందించకుండానే..పదోన్నతులు పొందుతున్నారనీ, విద్యార్థులకు పాఠాలు చెప్పిన దాఖలాలు లేవనీ, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించిందని ఆ అధికారి చెప్పారు.

తేడా వస్తే బదిలీవేటే..
actions against govt doctors: వైద్యులు పనితీరును మెరుగుపరచుకోకపోతే.. వారిని జిల్లా ఆసుపత్రులకు బదిలీ చేయాలని, శ్రుతి మించితే తొలగింపునకూ వెనుకాడరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలనిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో కీలక విభాగంలో ఉండీ.. అసలు సేవలందించకుండా కాలం గడుపుతున్న ఓ సీనియర్‌ వైద్యుడిపై ఇటీవలి సమీక్షలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్యసేవల్లో అవసరమైన పరికరాలను వెంటనే సమకూర్చాలన్న మంత్రి ఆదేశాలతో వైద్యఆరోగ్యశాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఏ విభాగానికి సంబంధించిన పరికరాలకు ఆ విభాగాధిపతే బాధ్యులవుతారనీ, వాటిని సద్వినియోగం చేసే బాధ్యతా వారిదేనని స్పష్టం చేసింది. వైద్యుల పనితీరుపై ప్రతివారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌.. వైద్యవిద్య సంచాలకులకు నివేదిక రూపంలో అందజేయాల్సి ఉంటుంది. దాన్ని వైద్యమంత్రి, ఆ శాఖ కార్యదర్శి కూడా పరిశీలిస్తారు.

ABOUT THE AUTHOR

...view details