కరోనా రెండోదశ తీవ్రస్థాయిలో ప్రబలుతుండటంతో ఇప్పటికే ఆక్సిజన్‌కు డిమాండ్ దాదాపు రెండింతలైంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగితే దీని అవసరం మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు పరిశ్రమలు పెద్ద మొత్తంలో ఆమ్లజనిని ఉత్పత్తి చేస్తాయి. చిన్న చిన్న మొత్తాల్లో తయారు చేసే పరిశ్రమలు కూడా ఎక్కువే ఉన్నాయి. వీటన్నింటినీ కలిపినా 120 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దాదాపు 350 టన్నుల ప్రాణవాయువు అవసరమని అంచనా. దీంతో మిగతా మొత్తం కోసం ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. కొవిడ్ నేపథ్యంలో గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 5 ప్లాంట్లను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. ఈ వారాంతానికి వాటిలో 3 అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఆపత్కాల ఏర్పాట్లే.
నిల్వలకు భారీగా ఏర్పాట్లు
రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు గత వారం నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాయి. సాధారణ రోజుల్లో 60 నుంచి 75 టన్నులు ఉత్పత్తి అయితే.. 50 టన్నుల వరకు డిమాండ్ ఉండేది. కరోనా తొలిదశలో రోజుకు 65 నుంచి 70 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం ఏర్పడిందని ఉత్పత్తిదారులు తెలిపారు. ఇప్పుడు 350 టన్నుల వరకు డిమాండ్ ఉంటుందని అంచనా. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం తదితర ప్రధాన ఆసుపత్రుల్లో ప్రభుత్వం భారీగా ఆక్సిజన్ నిల్వలకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లోనూ నిల్వ సదుపాయాలు ఉన్నాయి కాని ఉత్పత్తి ప్లాంట్లు లేవు. తాజాగా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లోని ఒక్కో ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం సమకూర్చింది.