Government Schools in Telangana :తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉందా? లేదా? అని పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తోంది. ప్రతి పంచాయతీ పరిధిలో ఒక పాఠశాల తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రతి పంచాయతీలో ఎన్ని బడులు ఉన్నాయి? ఉన్న బడి పనిచేస్తుందా? మూతబడిందా? తిరిగి తరగతులు నిర్వహించేందుకు భవనం అనుకూలంగా ఉందా? ఒకవేళ పంచాయతీ పరిధిలో పాఠశాల లేకుంటే మరో బడి ఎంత దూరంలో ఉంది? తదితర ప్రశ్నలతో కూడిన పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు(Education Officials) ఆయా డీఈవోలకు పంపారు. దీనిపై క్షేత్రస్థాయిలోని ఎంఈవోలు, సీఆర్‌పీలు, ఇతర సమగ్ర శిక్షాభియాన్ సిబ్బంది వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిరోజుల్లోనే పూర్తి వివరాలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
Telangana Government Schools :తెలంగాణ వ్యాప్తంగా 12,814 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను (Government Schools) పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 21,383లు ఉన్నాయి. అందులో 129 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లలోని (GHMC సహా) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు సుమారు 3000 వరకు ఉంటాయని పేర్కొంటున్నారు. కేవలం గ్రామ పంచాయతీల్లో 18,000 వరకు ప్రభుత్వ బడులు ఉన్నాయి.
Telangana government school: చాలాచోట్ల పేరుకే ఇంగ్లీషు మీడియం.. ప్రత్యేక ఉపాధ్యాయులు కరవు!
కిలోమీటరు దూరంలో బడిలేని ఆవాసాలు :రాష్ట్ర విభజనకు ముందు 8000ల పంచాయతీలు ఉండగా, అనంతరం మరో 5000ల దాక పెరిగాయి. రెండు దశాబ్దాలకు ముందు ఆపరేషన్ బ్లాక్ బోర్డు, రాజీవ్ విద్యామిషన్ కింద విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని పెద్దఎత్తున పాఠశాలలు ప్రారంభించారు. విద్యా హక్కు చట్టం-2010 ప్రకారం, ప్రతి ఆవాసానికి కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లలో ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలోగా హైస్కూళ్లను ఏర్పాటు చేయాలి. అలా చేయకుంటే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి లేదా భత్యం ఇవ్వాలి.