Government Schools In Ruins: హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెచ్చులూడిన గదుల్లో విద్యార్థులు భయంభయంగా చదువుకోవాల్సిన పరిస్థితి. ‘మన బస్తీ...మన బడి’ కింద ఎంపికైనా పనులు మొదలుకాలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్కారు బడులు శిథిలావస్థకు చేరి.. భీతిగొలుపుతున్నాయి. పాఠశాలలకు మరమ్మతులు, కొత్త గదుల నిర్మాణం వంటివి పూర్తిచేస్తామని ప్రభుత్వం చెప్పినా... ఇంకా కార్యాచరణ ప్రారంభం కాలేదు. అక్కడక్కడ ముహూర్తం చేసి కొబ్బరికాయలు కొట్టి ఊరుకున్నారు.
ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. మళ్లీ పునఃప్రారంభం జూన్ 13న. అంటే కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నిబంధనల ప్రకారం అంచనాలు, కేటాయింపు, టెండర్లు.. ఇలా ప్రక్రియలన్నీ ముగించి పనులు ఎప్పుడు మొదలుపెడతారో? ఎప్పటికి పూర్తిచేస్తారో సందేహాస్పదమే. చాలాచోట్ల పిల్లలు బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన దుస్థితి. పైకప్పు పెచ్చులూడి ఎప్పుడు తలలు పగులుతాయో తెలియని పరిస్థితి. నెర్రెలిచ్చి.. ప్రహరీల రక్షణ కొరవడి.. కరెంటు లేక.. ఉన్నా బయటకు వచ్చి భయపెడుతున్న తీగలు.. ఇలా ఎన్నో సమస్యలతో పాఠశాలలు కునారిల్లుతున్నాయి.
కొత్త పథకం ప్రకటించినా..
ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లోనే బడుల రూపురేఖలు మారుస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’ అని పేరు పెట్టింది. మూడు విడతల్లో రూ.7,289 కోట్లతో అన్ని పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా అధిక సంఖ్యలో విద్యార్థులున్న 9,123 పాఠశాలలను ఎంపిక చేసింది. అందుకు రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కానందున కొత్త తరగతి గదులు వచ్చే విద్యాసంవత్సరం మధ్యకాలానికైనా అందుబాటులోకి వస్తాయా అన్నది సందేహమే.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 188 మంది విద్యార్థులున్నారు. దాదాపు 30 ఏళ్ల కిందట నిర్మించిన గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలంలో గదుల్లోకి నీరు చేరడంతో నిలవలేని పరిస్థితి. ఇటీవల దీన్ని ‘మన ఊరు- మన బడి’లో ఎంపిక చేసినా, కేవలం ఒక గది మాత్రమే మంజూరు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది గదులూ శిథిలమై ఉన్నాయి.
ఏడాదంతా చెట్ల కిందే చదువులు!