Cyber Ambassadors: సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసు మహిళా భద్రత విభాగం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ‘సైబర్ అంబాసిడర్లు’ పేరిట ప్రచారకర్తలుగా ఎంపిక చేసింది. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వారికి వివరిస్తూ ఆ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి మెలకువలు నేర్పిస్తున్నారు. మహిళలపై సైబర్ వేధింపుల నిరోధానికి గతంలో చేపట్టిన ‘సైబ్-హర్’కు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. ఎంపిక చేసిన 6-10 తరగతుల విద్యార్థులకు సైబర్ భద్రత నిపుణుడు రక్షిత్ టాండన్ మార్గదర్శకత్వంలో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల్నీ ఇందులో భాగస్వాములుగా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం తొలివిడత శిక్షణ కొనసాగుతోందని, తర్ఫీదు పొందిన విద్యార్థులు తోటి విద్యార్థులకు, మహిళలకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తారని తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తెలిపారు.
నేర్పే అంశాలు
ఇంట్లో కంప్యూటర్, చేతిలో చరవాణి ఉన్నా.. వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించాలో చాలా మందికి తెలియదు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ మోసాల ద్వారా కొందరు ఆర్థికంగా నష్టపోతుంటే.. మరికొందరు వేధింపుల బారిన పడుతున్నారు. వేధింపులకు గురవుతున్న వారిలో సింహభాగం మహిళలే. వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయడం మొదలుకొని ఆన్‌లైన్ మోసాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల వరకు విద్యార్థులకు వివరిస్తున్నారు. ప్లేస్టోర్, డెస్క్‌టాప్ బ్రౌజర్లు, సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఎలా వినియోగించాలి? పోకిరీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎలా వేధిస్తారు? వాటిని అడ్డుకోవడమెలా? హ్యాకింగ్ బారిన పడితే బయటపడేదెలా? ఐపీ చిరునామాను ఎలా కనిపెట్టాలి? ఫోన్‌కు అపరిచితుల నుంచి లింకులు వస్తే ఏం చేయాలి? ఆన్‌లైన్ గేమ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై మెలకువలు నేర్పిస్తున్నారు. నేర్చుకున్న విషయాలను తోటి విద్యార్థులకు, మహిళలకు వివరిస్తూ వారు సైబర్ నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నా..
సైబర్ అంబాసిడర్‌గా ఎంపిక కాకముందు సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏమీ తెలిసేది కాదు. శిక్షణ ద్వారా చాలా అంశాలపై అవగాహన వచ్చింది. తోటి విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నా.
- నందిని, తొమ్మిదో తరగతి, శివ్వంపేట జడ్పీహెచ్‌ఎస్, సంగారెడ్డి జిల్లా