Food Processing Industries in Telangana :ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్న రాష్ట్ర రైతులు.. తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో వరి ధాన్యం నుంచి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు మార్కెట్ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్ మిల్లులు చేరి, పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Government Rice Mills in Telangana :దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి త్వరలోనే సీఎం శ్రీకారం చుట్టనున్నారు. వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత జపాన్‌కు చెందిన రైస్‌మిల్ కంపెనీసటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేసీఆర్ ఈ మేరకు చర్చలు జరిపారు. అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ రవీందర్ సింగ్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు మేలు జరిగేలా మరిన్ని ప్రణాళికలను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేయాలని, రైస్‌మిల్లుల స్థాపన నేపథ్యంలో మరిన్ని బాధ్యతలు చేపట్టేలా అధికారులు, సిబ్బందిని పెంచుకోవాలని కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు.
Rice Mills under Civil Supplies Department : కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నూనెకు విశ్వవిపణిలో మంచి డిమాండ్ ఉందని, రోజురోజుకూ పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి నిల్వల కోసం మరిన్ని గోదాములను ఈ మిల్లులకు అనుసంధానంగా నిర్మిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పండిన పంట వ్యర్థం కాకుండా, తరుగు లేకుండా, ధర తగ్గడం లాంటి నష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరి పంటను మార్కెటింగ్ చేయడం ద్వారా రైతులను ధనవంతులుగా మార్చే కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ చేపట్టనుందని కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు రైతుల పంటకు బహిరంగ మార్కెట్ ధర లభించేలా చేయడానికి.. ధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చే దిశగా జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.