ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతగ్రామం, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిన్న వాసాలమర్రి పర్యటనలో భాగంగా... సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రి గ్రామపంచాయతీలో ఉన్న 76 ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ దళితబంధు పథకం కింద 7.6 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
Dalitha Bandhu: వాసాలమర్రికి విడుదలైన దళితబంధు నిధులు.. సంబురాల్లో గ్రామస్థులు - Dalitha Bandhu funds
13:02 August 05
DALITHABANDHU: వాసాలమర్రిలో దళితబంధు అమలు ఉత్తర్వులు జారీ
ఈ మేరకు ఆ మొత్తాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు విడుదల చేయాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎండీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దళితబంధు పథకం అమలు మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎండీ, యాదాద్రి జిల్లా కలెక్టర్ కు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
వాసాలమర్రిలో 76 ఎస్సీ కుటుంబాలు ఉండగా.. అన్ని కుటుంబాలకు దళితబంధు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకం వాసాలమర్రితోనే ప్రారంభమవుతుందని... హుజూరాబాద్‌లో అయ్యేది లాంఛనమే అని నిన్న జరిగిన సమావేశంలో సీఎం వెల్లడించారు.
గ్రామస్థుల సంబురాలు...
'దళిత బంధు' పథకానికి నిధులు విడుదల కావటం పట్ల వాసాలమర్రి గ్రామస్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఫథకాన్ని వాసాలమర్రి నుంచే ప్రారంభించటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆటపాటలతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సబ్బండ వర్గాల ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్ మారారని... దళితుల సాధికారత కోసం తీసుకొచ్చిన 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనని గ్రామస్థులు కొనియాడారు.
ఇవీ చూడండి: