దిశ ఎన్కౌంటర్ మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం భద్రత కల్పించింది. సిర్పూర్కర్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంది. ఎన్కౌంటర్పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. కమిషన్ ఎదుట హాజరు కావొద్దంటూ బెదిరింపులు వస్తున్నాయని మృతుల కుటుంబ సభ్యులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే చెన్నకేశవులు తండ్రిని రహదారి ప్రమాదంలో మృతి చెందాడని.. ఆ ప్రమాదంపైనా అనుమానాలున్నాయని కమిషన్కు తెలిపారు. విచారణకు హాజరు కాకుండా...కేసును ఉపసంహరించుకుంటే 25లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తున్నారనే విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది... కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో విచారణ ముగిసే వరకు భద్రత కల్పించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వచ్చిన మృతుల కుటుంబ సభ్యులకు భద్రతగా ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. మక్తల్ నియోజకవర్గంలోని గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లోని బాధితుల ఇళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేశారు.