Hyderabad pharma city inauguration : హైదరాబాద్ ఔషధ నగరిని దసరాకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఫార్మాసిటీలో ఇప్పటికే మౌలిక వసతుల పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చురుగ్గా నిర్వహిస్తోంది. తాజాగా దసరా ముహుర్తం ఖరారు కావడంతో సన్నాహాలు ముమ్మరం కానున్నాయి.
Hyderabad pharma city news : హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ సంస్థల సమూహం నిర్మాణానికి 2014 నవంబరులో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో ఆ ఏడాది డిసెంబరులోనే భూములను సందర్శించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల్లోని 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. స్వదేశీ పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా రూపకల్పన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో పూర్తిగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం, ప్రపంచ ఔషధ విశ్వవిద్యాలయం, లాజిస్టిక్ పార్కు, పరీక్ష ప్రయోగశాల, అంకురాల హబ్ ఏర్పాటు వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి.
సెప్టెంబరు నెలాఖరు నాటికి..: రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి హోదా కల్పించింది. ఇప్పటికే 420 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ నెలాఖరుకు భూసేకరణ పూర్తి కానుంది. గతేడాది మౌలిక వసతుల పనులను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు నలుమూలలా రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. నీటి సరఫరా కోసం పైపులైన్‌లు వేశారు. విద్యుత్తు సబ్‌స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. భూనిర్వాసితుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆయా కుటుంబాల్లోని యువతకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి ప్రాథమిక మౌలిక వసతులు పూర్తి చేసి దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రధానిని ఆహ్వానించినా..: దసరాకు రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్మృతి చిహ్నం, మీడియా అకాడమీ భవనాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ జాబితాలో ఔషధ నగరినీ చేర్చాలని అధికారవర్గాలకు సంకేతాలను ఇచ్చింది. ఔషధనగరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం గతంలో కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించారు. ప్రస్తుతం సత్సంబంధాలు లేకపోవడంతో ముఖ్యమంత్రే ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
150 సంస్థలకు భూకేటాయింపులు..:ప్రారంభోత్సవం రోజున ఒకేసారి 150 సంస్థలకు భూములను కేటాయింపు పత్రాలను ఇవ్వనున్నారు. ఆయా కంపెనీల ఎంపికకు కసరత్తు మొదలైంది. ఔషధనగరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం గతంలో సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి ఆహ్వానించారు. ఇప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు లేకపోవడంతో ముఖ్యమంత్రే దీనిని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని ఔషధరంగ దిగ్గజాలను, ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. ఔషధనగరిలో మౌలిక వసతుల కోసం రూ.4922 కోట్ల నిధులను ఇవ్వాలని తెలంగాణ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రధానికి విన్నవించగా, మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసి అభ్యర్థించారు. మరోవైపు ఔషధనగరికి సహజ వాయువు సరఫరా చేయాలని విన్నవించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పనులు సాగుతున్నాయి.