తెలంగాణ దశాబ్ది వేడుకలకు.. రేపు తుదిరూపు Telangana Formation Day Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వేడుకల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలోనూ విస్తృతంగా చర్చించారు. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి, వచ్చిన మార్పులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో వివరించారు. ఒకనాడు వెనకబడిన ప్రాంతంగా పేరుపడ్డ తెలంగాణ.. నేడు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.
గ్రామగ్రామాన ఉత్సవాలు:ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా.. తెలంగాణ పథకాలను అమలు చేయాల్సిన విధిలేని పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడంతోనే ఇది సాధ్యమైందని.. తొమ్మిదేళ్ల తెలంగాణ విజయాలను ఘనంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. సొంత రాష్ట్రం పదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రతి తెలంగాణ వాసికి ఇదో పండగ అన్న ముఖ్యమంత్రి.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా ఘనంగా వేడుకలను గ్రామగ్రామాన నిర్వహించాలని అన్నారు.
మూడు వారాల పాటు ఒక్కో రోజు ఒక్కో రంగానికి సంబంధించిన అంశాలను తీసుకొని.. వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. లబ్దిదారులుగా ఉన్న ప్రజలను భాగస్వామ్యులుగా చేస్తూ ఉత్సవాలు నిర్వహించేలా విధివిధానాలు ఖరారు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఆయా రంగాలకు సంబంధించి 2014 ముందు పరిస్థితులు.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. వాటి వల్ల కలిగిన మార్పులు, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ డాక్యుమెంటరీలు సిద్ధం చేస్తున్నారు. ఆయా శాఖలకు సంబంధించి గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవాళ ప్రణాళిక విడుదల: వేడుకల నిర్వహణపై తమ శాఖలకు చెందిన అధికారులతో మంత్రులు ఇవాళ సమావేశం కానున్నారు. శాఖకు సంబంధించిన అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. ఆయా శాఖలకు సంబంధించి ముసాయిదా సిద్ధం చేస్తారు. మంత్రులు, అధికారులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షిస్తారు. ఉత్సవాల నిర్వహణా ప్రణాళిక, విధివిధానాలను సీఎం ఖరారు చేయనున్నారు. అందుకు అనుగుణంగా మూడు వారాల పాటు తెలంగాణ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి.
ఇవీ చదవండి: