Telangana Formation Day Celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను వైభవంగా, పండగ వాతావరణంలో నిర్వహించేందుకు.. ప్రభుత్వం సిద్దమైంది. జూన్ రెండో తేదీ నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని అందరికీ చాటిచెప్పేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల పూర్వ స్థితిగతులు, తొమ్మిదేళ్లలో తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా కళ్లకు కట్టేలా వివరించనున్నారు.
Telangana Formation Day Decade Celebrations 2023 : ఇందుకోసం ఆయా రంగాల వారీగా డాక్యుమెంటరీలను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం పడింది. వారం రోజులుగా సర్కార్ యంత్రాంగం పూర్తిగా దీనిపైనే కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డాక్యుమెంటరీలు అత్యున్నత ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సీఎం అధికారులకు పదేపదే స్పష్టం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఏజెన్సీలతో వీటిని రూపకల్పన చేసే పనిలో పడ్డారు.
తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా చాటేలా : అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించుకొని తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా చాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రగతి.. తదితర అంశాలపై కవిసమ్మేళనాలు, జానపద, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ పిండి వంటలతో ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని :శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పాలకపక్షం భావిస్తోంది. తొమ్మిదేళ్ల ప్రగతిని ఘనంగా చాటడం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. పథకాల లబ్ధిని వివరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితాలతో పాటు సర్కార్ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.