Oil Palm Cultivation: రాష్ట్రంలో దశల వారీగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 9.25 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. 90 నుంచి 100 లక్షల టన్నుల లోటును దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్నారు. రాష్ట్రంలో 1993 నుంచి ఇప్పటి వరకు 68,440 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. సరైన ప్రోత్సాహం కొరవడటంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ప్రస్తుతం 37,077 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెరిగిన సాగు నీటి వనరుల దృష్ట్యా.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండతో పాటు 26 జిల్లాలు ఆయిల్‌పామ్ సాగుకు అనువైనవిగా కేంద్రం గుర్తించింది. రాష్ట్ర స్వయం సమృద్ధితోపాటు దేశ అవసరాలు తీర్చే దిశగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది.
ఎకరానికి రూ.9,650 రాయితీ..:ఆయిల్‌పామ్ సాగు విస్తరణ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఎంపిక చేసిన క్షేత్రాల్లో శాస్త్రీయంగా పెంచుతున్న మొక్కల లభ్యత దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో సాగు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆయిల్‌పామ్ మొక్కల కోసం ఎకరానికి రూ.9,650 రాయితీ ఇస్తోంది. మరోవైపు ఎకరాకు సంవత్సరానికి 4,200 రూపాయల చొప్పున నాలుగేళ్ల పాటు రాయితీ అందిస్తుంది. బిందు సేద్యంపైనా 80 నుంచి 100 శాతం వరకు రాయితీ ఇస్తోంది. 26 జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లు కేటాయించింది. ఆ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 30 నర్సరీలు ఏర్పాటు చేసి సంవత్సరానికి 2.25 కోట్ల మొక్కలు పెంచేలా చర్యలకు ఉపక్రమించాయి.
రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు..: ప్రభుత్వం, కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం జిల్లాలకు నిర్దేశించిన కంపెనీలు.. తమ ఫ్యాక్టరీ జోన్‌లో ఆయిల్‌పామ్ తోట నాటిన 36 నెలల్లో మిల్లులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అవసరాన్ని బట్టి మిల్లుల సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కంపెనీలు అవసరమైన భూమిని సమీకరించుకుంటున్నాయి. ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.