తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Teachers Allotment: ఉపాధ్యాయుల పోస్టింగ్‌లపై ప్రభుత్వం ఊగిసలాట - పోస్టింగుల కేటాయింపులు

TS Teachers Allotment Issue: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఉదయం అభ్యంతరాలు లేని కేడర్​లో పోస్టింగ్​లు ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం.. సాయంత్రం ఆ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోస్టింగుల ప్రక్రియ ఆగిపోయింది.

TS Teachers Allotment Issue
ఉపాధ్యాయుల పోస్టింగ్‌లు

By

Published : Jan 4, 2022, 8:10 AM IST

TS Teachers Allotment: ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లను కేటాయించడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దంపతుల విభాగం దరఖాస్తులు, ఇతర అభ్యంతరాలు లేని కేడర్‌లోని పోస్టింగ్‌లను ఇచ్చేయాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారని విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా జిల్లా అధికారులకు సోమవారం ఉదయం సంక్షిప్త సందేశాలు పంపినట్లు సమాచారం. ఇతర కేడర్ల పోస్టింగ్‌లపై తర్వాత సూచనలిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు సన్నద్ధమయ్యారు. వివాదాలు లేని కేడర్‌ (పాఠశాల యాజమాన్యం, మాధ్యమం, సబ్జెక్టు తదితర)లోని ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఆర్థికశాఖ పోర్టల్‌ ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని భావించారు. తీరా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎస్‌ ఆర్డర్లు ఆపాలన్నారంటూ.. కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దాంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. వాస్తవానికి వివాదం లేని పోస్టులు 11,052 ఉండగా అందులో 8,137 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇంకా 2,915 ఖాళీలున్నాయి. అంటే 8,137 మందికి పోస్టింగ్‌లు నిలిచిపోయాయి.

ఆ విభాగం ఉపాధ్యాయుల దరఖాస్తుల తిరస్కరణ!

దంపతుల విభాగంలో ఈసారి ఎవరి దరఖాస్తులు అనుమతిస్తాం? ఎవరు అనర్హులనేది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. దాంతో దాదాపు 5 వేల వరకు స్పౌస్‌ దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించిన అధికారులు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో తమ భాగస్వామి పనిచేస్తున్నారని.. తమను ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని పెట్టుకున్న దరఖాస్తులను పరిగణించలేదని తెలిసింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో తమ భాగస్వామి పనిచేస్తున్నారని, తన దరఖాస్తును పరిశీలించాలని ఒక ఉపాధ్యాయుడు అర్జీ పెట్టుకున్నారు. దాన్నీ లెక్కల్లోకి తీసుకోలేదు. దీనిపై ఆయన సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నారు. సెంట్రల్‌ బ్యాంకు...అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనం అనుకుని తిరస్కరించి ఉంటారని ఆ అధికారి సమాధానమిచ్చారు.

జీవో విడుదలైన తర్వాతే సంఘాలతో సమావేశం

టీచర్లను కొత్త జిల్లాల వారీగా కేటాయించే జీవో విడుదలకు ముందే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పడం సరైనది కాదని పలు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. డిసెంబరు 6న జీవో 317 విడుదల చేసిన ప్రభుత్వం.. ఉపాధ్యాయ సంఘాలతో ఆ నెల 13న సమావేశం నిర్వహించిందని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలను పాటించి.. తగిన సమయం కేటాయించి.. పారదర్శకంగా ప్రక్రియను ముగిస్తే ఈ సమస్యలు వచ్చేవి కావని ఎస్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ మంత్రి సమావేశం ఏర్పాటుచేసినా ఏ ఒక్క సూచనను ప్రభుత్వం పాటించలేదని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్‌ పేర్కొన్నారు. జీవో 317పై మంత్రి కమలాకర్‌ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(టీఎస్‌పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌ అలీ, ప్రధాన కార్యదర్శి చెన్నరాములు సూచించారు.

ఇదీ చూడండి:Telangana Teachers Arrest: ఉపాధ్యాయ సంఘాల నేతల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details